యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో మంగళూరు సోయగం పూజాహెగ్డే ఒకరు. అనతికాలంలోనే తారాపథంలో అగ్రస్థాయికి చేరుకుందీ అమ్మడు. తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలందరితో జోడీ కడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నది. నేడు పూజాహెగ్డే జన్మదినం. ఈ సందర్భంగా ఆమె కథానాయికగా అక్కినేని అఖిల్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే విభ అనే హుషారైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. స్టాండప్ కమెడియన్గా ఆమె పాత్ర ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని చిత్ర బృందం తెలిపింది. తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రగా విభ నిలిచిపోతుందని పూజాహెగ్డే పేర్కొంది.