Pooja Hegde | కన్నడ సోయగం పూజాహెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. సినిమాలపరంగా భారీ అవకాశాలైతే వస్తున్నాయిగానీ ఆశించిన విజయాలు దక్కడం లేదు. మంచి హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో ఉందీ భామ. తాజాగా ఈ అమ్మడు తమిళంలో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్న విషయం తెలిసిందే. ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు.
ఈ నేపథ్యంలో తన చివరి చిత్రానికి సన్నద్ధమవుతున్నారు విజయ్. దళపతి 69 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో పూజాహెగ్డే ప్రధాన నాయికగా ఖరారైందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
గతంలో విజయ్‌తో కలిసి ‘బీస్ట్’ చిత్రంలో నటించింది పూజాహెగ్డే. మరోమారు ఈ జోడీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం. కెరీర్‌పరంగా ఈ సినిమా పూజాహెగ్డేకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.