మంగళూరు సోయగం పూజాహెగ్డేకు హాస్య చతురత కాస్త ఎక్కువే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండటం, కష్టాల్ని కూడా చిరునవ్వుతో స్వీకరించడం తన నైజమని చెబుతుంటుందీ భామ. అందుకు తగినట్లుగానే తన తాజా ఇన్స్టాగ్రామ్ వీడియోపై ఈ భామ చేసిన కామెంట్ ఆమెలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు అద్దం పట్టిందని అంటున్నారు నెటిజన్లు. రెండు వారాల క్రితం కాలికి తీవ్ర గాయం కావడంతో ముంబయిలోని ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నది పూజాహెగ్డే.
తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తాను ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని, మెల్లగా లేచి నడవటం ప్రాక్టీస్ చేస్తున్నానని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుతుంది. ‘జీవితంలో మళ్లీ నడక నేర్చుకుంటున్నా. ఇవే నా తొలి అడుగులు’ అంటూ లాఫింగ్ ఎమోజీతో వీడియో గురించి కామెంట్ చేసింది. కింద పడ్డా సరే, తిరిగి ఉత్సాహాన్ని పుంజుకొని పైకి లేవాల్సిందే, మరింత గట్టిగా నిలిబడాలి..అంటూ మరో వీడియో గురించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, సర్కస్ చిత్రాలతో పాటు తెలుగులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది.