Ponniyin Selvan-2 Movie On OTT | చడి చప్పుడు చేయకుండా ‘పొన్నియన్ సెల్వన్-2’ గత రాత్రి ఓటీటీలోకి వచ్చేసింది. ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్దగా అంచనాల్లేకుండానే తెలుగులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొసమెర కూడా ఆకట్టుకోలేకపోయింది. తమిళం సంగతి అటుంచితే తెలుగులో మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే తొలిపార్టు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయింది. కానీ సెకండ్ పార్ట్ పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్ ఎప్పటిలాగే ఓ ట్విస్ట్ ఇచ్చింది.
పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 చూడాలంటే రెంట్ పే చేయాల్సిందే. ఈ సినిమాను ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నా సరే అక్షరాల రూ.399 కట్టాల్సిందే. అయితే క్యాష్ బ్యాక్ రూపంలో రూ.100 వెనక్కు ఇచ్చే ఆఫర్‌ను కూడా పెట్టింది. అలా చూసుకున్నా ఈ సినిమా చూడాలంటే రూ.299 పెట్టాల్సిందే. పోని ఇంత ఖర్చు పెట్టి రెంట్‌కు తీసుకున్నా ఇందులోనూ మరో కిరికిరి ఉంది. అదేంటంటే షో మొదలు పెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ సినిమాను చూడాలి. ఆ తర్వాత లింక్ పనిచేయదు. ఇలా వందలకు వందలు పోగేసి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోని.. మళ్లీ అందులో వందలు పెట్టి సినిమాలు చూడాలంటే అన్యాయం అని అంటున్నారు సినీ లవర్స్.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు అందించాడు. ఇక తమిళంలో అటో ఇటో గట్టెక్కిన ఈ సినిమా.. మిగితా భాషల్లో మాత్రం నిరాశపరిచింది. ఇక తొలిపార్టు వల్ల దిల్‌రాజుకు లాభాల పంట పండకపోయినా.. నష్టాలు మాత్రం రాలేవు. కానీ సెకండ్ పార్ట్ మాత్రం కాస్త నష్టాలే మిగిల్చింది.