Pongal Race | టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే సినిమా వర్గాల్లో అసలైన ఫెస్టివల్ టైమ్. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ అనేది సాధారణమే అయినా, ఇటీవల ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతోంది. 2026 సంక్రాంతికి మొదట్లో పోటీ తక్కువగా అనిపించినా, ఇప్పుడది ఊహించని స్థాయికి చేరింది.చిరంజీవి, నవీన్ పోలిశెట్టి సినిమాలతో మొదలైన పోటీ రేసులో తాజాగా ప్రభాస్, శర్వానంద్, రవితేజ కూడా జాయిన్ అవుతుండటంతో సంక్రాంతి బరిలో హీరోల మధ్య వార్ ఓ రేంజ్లో ఉంటుదనిపిస్తుంది. అయితే, ఇది కేవలం హీరోలకే పరిమితమా అంటే, అస్సలు కాదు! హీరోయిన్స్ మధ్య పోటీ కూడా తారాస్థాయిలోనే ఉండనుంది.
జనవరి 9న రిలీజ్ కానున్న ‘రాజాసాబ్’ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురి కెరీర్‌కు ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. ఒకే సినిమాలో ముగ్గురు నాయికలు పోటీపడతుండటం, ప్రేక్షకుల ఫేవరెట్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘శంకర వరప్రసాద్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడీగా నయనతార నటిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథతో వస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్రకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ చిత్రాలతో సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, నవీన్ సినిమాతో మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి పలకరించనుంది. ఈ సంక్రాంతికి మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇక శర్వానంద్ సినిమా విషయానికి వస్తే ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తుండగా, ఇందులో ఆషికా రంగనాథ్‌తో పాటు మరో హీరోయిన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. డబుల్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుండటం, ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి సిద్ధమవుతున్నాయి. వీటిలో జననాయగన్ సంక్రాంతికి రానుండగా, ఇందులో పూజా హెగ్డే, మమితా హీరోయిన్స్ గా నటించారు. కరుప్పు లో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. పరాశక్తిలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది.మొత్తం మీద…2026 సంక్రాంతి రేస్‌లో హీరోలు vs హీరోలు పోటీతో పాటు, హీరోయిన్స్ vs హీరోయిన్స్ పోటీ కూడా గట్టిగానే ఉండనుంది.