‘మా ఊరి పొలిమేర’ తొలిపార్ట్ హిట్ అయ్యిందని మేం ‘మా ఊరి పొలిమేర 2’ తీయలేదు. సీక్వెల్‌కి ముందే ప్లాన్‌చేశాం. కేవలం దర్శకుడిపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేశాం’ అని నిర్మాత గౌరీకృష్ణ అన్నారు. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’ ఈ శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత గౌరికృష్ణ విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ ఇంతటి విజయాన్ని మేం ఊహించలేదు. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందీ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా స్థాయి వసూళ్లను రాబడుతున్నది’ అని నిర్మాత సంతోషం వెలిబుచ్చారు.
టీమ్ అంతా కలిసి థియేటర్లు తిరుతున్నామని, ఇందులోని ప్రతి ట్విస్ట్‌కు ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతున్నారని, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూసి, కష్టాన్ని మరిచిపోయామని నిర్మాత అన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలకు ప్రేరణగానే దర్శకుడు ఈ కథ రాసుకున్నాడని, నేపథ్యం కొత్తగా ఉండటం కూడా ఈ సినిమా విజయానికి ఓ కారణమని, ఇలాగే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమాలు తీయడమే నిర్మాతగా తన లక్ష్యమని గౌరీకృష్ణ చెప్పారు.