Hari Hara Veeramallu | చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జులై 24న ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా సందడి చేశారు. ఇక ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్. ముందుగా ఆంధ్రాలో జరగనుందని అన్నారు. కాని ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కే కార్యక్రమం షిఫ్ట్ అయింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ వేడుక వైభవంగా జరగనుంది.
ఈవెంట్ కోసం అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్నప్పటికీ, పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఇవ్వనున్నారు. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు క్లియర్ పర్మిషన్ మంజూరు చేశారు. అయితే పలు కఠిన షరతులతో కూడిన అనుమతినే ఈ ఈవెంట్‌కు ఇచ్చారు. అధికార సమాచారం మేరకు ఈ కార్యక్రమంలో మొత్తం 1000 నుండి 1500 మందికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టంచేశారు.మరోవైపు ఈవెంట్‌కు నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లోపల ఉండే ప్రేక్షకులతో పాటు, బయట ఏర్పడే అభిమానుల గుంపును కూడా నిర్మాతలు నియంత్రించాల్సి ఉంటుంది.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా, నిర్మాతలకే పూర్తి బాధ్యత ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.సెక్యూరిటీ, ట్రాఫిక్, ప్రజల రద్దీ వంటి అన్ని అంశాల్లో నిర్మాతలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ నేపథ్యంలో ఈవెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు చిత్ర బృందం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అభిమానుల భద్రతకు ఎటువంటి లోటు ఉండకూడదని చిత్ర యూనిట్ ధృవీకరించింది.ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగిన సందర్భంలో, ఈ ఈవెంట్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.