‘తల్లికడుపులో పెరిగే బిడ్డను ‘పిండం’ అంటాం. పోయాక ఆత్మశాంతికోసం పెట్టే భోజనాన్ని ‘పిండం’ అంటాం. ఒకటి జీవితాన్నిస్తుంది. ఇంకొకటి మరణం తర్వాత కూడా ఆనందాన్ని ఇస్తుంది. పైగా ఈ కథకు ఈ టైటిలే కరెక్ట్. ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు. ఇదో భావోద్వేగ ప్రయాణం’ అన్నారు హీరో శ్రీరామ్. ఆయన హీరోగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. యశ్వత్ దగ్గుమాటి నిర్మాత. నేడు విడుదల కానుంది.
ఈ సందర్భంగా శ్రీరామ్ విలేకరులతో ముచ్చటించారు. ‘హారర్ సినిమాలంటే థియేటర్లో మనం చూసేటప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. ఈ సినిమా అలాంటిదే. వర్తమానంతోపాటు 1930, 1990 కాలాల్లో నడిచే కథ ఇది.’ అని హీరో శ్రీరామ్ అన్నారు. ఇంకా చెబుతూ ‘నా దృష్టిలో భయంకరమైన సినిమా అంటే రామ్‌గోపాల్‌వర్మ ‘రాత్రి’. నేను చాలాసార్లు చూసిన సినిమా అది. ఇంకా పలు ఇంగ్లీష్ హారర్ సినిమాలు కూడా చూశాను. వాటికి ఏ మాత్రం ‘పిండం’ తీసిపోదు. ఈ సినిమాను థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలనుకుంటున్నాను’ అని శ్రీరామ్ తెలిపారు.