డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్‌శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రధారులుగా, మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథాచిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్ఎం మురళి(గోదావరి కిట్టయ్య) నిర్మాతలు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు చంద్రమహేశ్ బ్లాక్‌బస్టర్ ‘ప్రేయసిరావే’ టీమ్ హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీరాజా, ఎంఎం శ్రీలేఖ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
తదనంతరం చిత్రబృందానికి వారంతా శుభాకాంక్షలు అందించారు. ‘నాకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన సినిమా ‘ప్రేయసి రావే’. ఆ టీమ్ ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ‘పిఠాపురంలో’ సినిమాను కొందరు శ్రేయోభిలాషులకు చూపించాను. చూసినవారంతా ఎమోషనల్ అయ్యారు. సినిమాకు పనిచేసినవారంతా ప్రాణం పెట్టేశారు. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే ఈ కథలో ఉంటాయి. చూస్తున్నంతసేపూ అవన్నీ తమ ఇంట్లోనే జరిగినట్టు ఫీలవుతారు. అలాంటి గొప్ప సినిమా ఇది’ అని దర్శకుడు మహేశ్‌చంద్ర అన్నారు. సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇదని నిర్మాత సురేశ్ పటేల్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.