Peddi | పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ‘పెద్ది’ (Peddi) సినిమా నుంచి వచ్చిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతుంది . మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక గీతానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించబోతోందని సమాచారం. ఈ ప్రత్యేక గీతాన్ని పూణెలో రేపటి నుంచి (అక్టోబర్ 10, 2025) చిత్రీకరించనున్నారు. అందులో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ స్టెప్పులు వేయనుండటం మరో హైలైట్. చరణ్ – జాన్వీ కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది.
ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను మెలోడీ మరియు ఎనర్జీతో మిక్స్ చేసిన ఒక ప్రత్యేక ట్యూన్‌గా రూపొందించారని సమాచారం. ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చరణ్ స్టైల్, జాన్వీ గ్రేస్, వీరిద్దరి కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం పేర్కొంటోంది. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మొదటి భాగం ఎడిటింగ్ పనులు నవీన్ నూలి పూర్తి చేశాడన్న టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ పూర్తిగా డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. గుబురు గడ్డం, మీసాలు, ముక్కుకి రింగ్‌తో గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టు ఆయన లుక్ డిజైన్ చేయడం జరిగింది.
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ.. ఈ కథను డైరెక్టర్ బుచ్చి బాబు అద్భుతంగా రాశారు. రంగస్థలంకు కొంత స్పూర్తి ఉన్నప్పటికీ, పెద్ది పూర్తిగా కొత్త కథ. ఇది ఇతర సినిమాను పోలి ఉండదు. రామ్‌చరణ్ ఈ సినిమాలో కొత్త యాస, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టనున్నారు. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్, ఎమోషన్, మాస్ అంశాలతో మిళితమైన ఈ కథను వృద్ధి సినిమాస్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. చిత్రబృందం ఇచ్చిన అప్డేట్ ప్రకారం, ఈ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, టీజర్లు, పాటలతో మూవీ ప్రమోషన్స్ మరింత ఉత్కంఠ రేపేలా ఉండనున్నాయి.