Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కుస్తీతో పాటు క్రికెట్ ఆడే పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన విజువల్స్ స్పష్టం చేశాయి. మాస్, ఎమోషన్, స్పోర్ట్స్ అంశాల కలయికగా రూపొందుతున్న ఈ చిత్రంపై రోజురోజుకీ హైప్ పెరుగుతోంది.
ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఓ అభిమాని “పెద్ది ప్రమోషన్స్ ఎక్కడ?” అంటూ లేఖ రాయగా, దానికి స్పందించిన చిత్రబృందం ‘పవర్ ప్లే టూర్’ పేరుతో ప్రత్యేక ప్రమోషనల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో ఏ తేదీన ఏ నగరంలో ఈవెంట్ జరుగుతుందో ప్రకటించారు. మే 18న ముంబైలో భారీ వేడుక నిర్వహించి ‘పెద్ది’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మే 22న ఉప్పల్ స్టేడియంలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మే 23న భోపాల్‌లో ప్రత్యేక పాటల విడుదల కార్యక్రమం ఉండనుండగా, మే 24న బెంగళూరులో మరో భారీ ఈవెంట్ జరగనుంది. అనంతరం మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక జూన్ 1న విజయనగరంలో అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సినిమా కథ విజయనగరం నేపథ్యంతో సాగనున్న నేపథ్యంలో అక్కడి ఈవెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరగా జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల మధ్య నిర్వహించనున్నారు. మొత్తంగా కేవలం 8 రోజుల్లో 7 నగరాల్లో ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “ఇదే అసలైన పాన్ ఇండియా ప్రమోషన్” అంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ట్రైలర్ విడుదలతో ‘పెద్ది’ ఫీవర్ మరింత పెరగనుందని, విడుదలకు ముందే సినిమా దేశవ్యాప్తంగా భారీ హైప్ సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
#PEDDI – Mana Cinema Aadukodam Gurinche 💥
Get ready for the games 🥰
In cinemas JUNE 4th ❤️ https://t.co/f41uSE09yc pic.twitter.com/4QChYp8BxW— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026