Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు, ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలతో కూడిన కథతో రూపొందుతున్న ఈ సినిమాపై రామ్ చరణ్ కూడా అసాధారణమైన నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా ఏ సినిమా గురించి కూడా ఎక్కువగా మాట్లాడని చరణ్, ‘పెద్ది’పై మాత్రం పలు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌లో కుతూహలాన్ని రెట్టింపు చేసింది.
ఇక రిలీజ్ ప్లానింగ్ విషయంలో కూడా మేకర్స్ ముందుగానే స్ట్రాంగ్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. షూటింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా టీమ్ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో గతంలో ప్రకటించినట్లే 2026 మార్చ్ 27న గ్రాండ్ రీలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా వాయిదా పడనున్నదనే వార్తలు వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ కొంత ఆందోళనకు గురయ్యారు.ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్న టాక్ ప్రకారం, మార్చ్ చివర్లో అనేక పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ‘పెద్ది’కి సోలో విండో దొరకకపోవచ్చనే కారణంతో మేకర్స్ వాయిదా ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబు మాత్రం మార్చ్ 27 తేదీనే సినిమాని విడుదల చేయాలని పకడ్బందీ ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నాటికి అన్ని పనులు పూర్తిచేసి సినిమాను సమయానికి విడుదల చేయాలన్నదే ఆయన ప్లాన్. అంతేకాకుండా ‘పెద్ది’ నుంచి రెండో సాంగ్ అప్డేట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ‘చికిరి’ సాంగ్‌కి వచ్చిన స్పందనను మించి ఈ కొత్త పాట నిలుస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగా అభిమానులను ఉత్సాహపరుస్తూ, ‘పెద్ది’ నుండి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ రానున్నాయని అంటున్నారు.