Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోస్టర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. తర్వాత అది జగపతి బాబు అని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు. స్టైలిష్, పవర్ఫుల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనమివ్వబోతున్నారు.
‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి పాత్ర కోసం జగపతి బాబు పూర్తిగా తన రూపాన్ని మార్చుకున్నట్లు ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది. గడ్డం, రఫ్ లుక్, కళ్లలో కనిపించే ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో తనకు సరిపోయే బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు, ఈ సినిమాలో మరో మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్. ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ‘పెద్ది’ మూవీ టీమ్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పెద్దిలో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అని ట్వీట్ చేసింది.
ఈ పోస్టర్‌ను రామ్ చరణ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. “స్క్రీన్కు అతడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్లా సాధ్యం కాదు. జగపతి బాబు గారిని పెద్దిలో అప్పలసూరిగా చూడటం చాలా సంతోషంగా ఉంది” అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించగా, చరణ్ స్టెప్పులు, ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్‌పై పలు రూమర్లు వచ్చినప్పటికీ, మూవీ టీమ్ మాత్రం పదే పదే స్పష్టత ఇస్తూ వస్తోంది. తాజాగా జగపతి బాబు ఫస్ట్ లుక్‌తో పాటు మరోసారి మార్చి 27, 2026 విడుదల తేదీని కన్ఫర్మ్ చేయడం విశేషం.