Peddi: ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటలతో దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో అతిపెద్ద సమస్యగా మారుతున్న పైరసీని అడ్డుకునేందుకు మేకర్స్ న్యాయపరమైన చర్యలు చేపట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా విడుదలకు ముందు నుంచే ‘పెద్ది’ మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను అక్రమంగా లీక్ చేయడం, ఆన్లైన్లో షేర్ చేయడం, టెలిగ్రామ్, టోరెంట్, పైరసీ వెబ్సైట్ల ద్వారా ప్రసారం చేయడాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ‘పెద్ది’ సినిమాను ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, కాపీలు పంపిణీ చేయడం, సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయడం పూర్తిగా నిషేధించబడింది. దీంతో సినిమా విడుదల రోజునే పైరసీ వెబ్సైట్లలో మూవీ దర్శనమివ్వకుండా బలమైన రక్షణ లభించినట్టైంది.
ఈ కేసులో కోర్టు ఇచ్చిన అత్యంత కీలకమైన అంశం ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఆర్డర్. సాధారణంగా ఒక పైరసీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే, నిర్వాహకులు కొత్త యూఆర్ఎల్ లేదా కొత్త డొమైన్‌తో మళ్లీ ప్రత్యక్షమవుతుంటారు. అయితే ఈసారి అలాంటి అవకాశం లేకుండా కోర్టు ముందస్తు చర్యలు తీసుకుంది. ఒకసారి బ్లాక్ అయిన పైరసీ సైట్లు కొత్త పేర్లతో వచ్చినా వాటిని కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే అధికారం సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చింది. దీంతో ‘పెద్ది’ మూవీని అక్రమంగా లీక్ చేసే ప్రయత్నాలకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. కొద్ది రోజుల క్రితం దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే నెట్టింట లీక్ కావడం సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు పైరసీ కారణంగా కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరింత అప్రమత్తమవుతున్నారు.