Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సక్సెస్ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక తాజా అంశం అభిమానుల్లో ఆసక్తిని, అదే సమయంలో కొంత గందరగోళాన్ని కూడా సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని బుధవారం నుంచి ‘పెద్ది’ చిత్రానికి కొన్ని కొత్త సీన్లు జోడిస్తున్నామని ప్రకటించారు.
ఈ కామెంట్స్‌తో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే సినిమా చూసిన వారు కూడా కొత్త ఫుటేజ్‌ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించారు.అయితే దర్శకుడు ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాధారణంగా ఇలాంటి మార్పులు చేస్తే కొత్త పోస్టర్లు, అప్డేటెడ్ రన్‌టైమ్ వివరాలు లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా మేకర్స్ అధికారికంగా తెలియజేస్తారు. కానీ ఈసారి అలాంటి సమాచారం రాకపోవడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
కొత్త సీన్లు నిజంగానే ఈరోజు నుంచి ప్రదర్శించబడుతున్నాయా? లేక సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని ఫ్యాన్ పేజీలు అదనపు సీన్లు జోడించారని చెబుతుండగా , కొందరు మాత్రం ఇంకా ఎలాంటి మార్పులు కనిపించలేదని చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఉదయం షోలు చూసిన ప్రేక్షకుల స్పందన లేదా మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ నిజంగానే కొత్త సన్నివేశాలు జోడించి ఉంటే, ఇప్పటికే మంచి వసూళ్లు సాధిస్తున్న ‘పెద్ది’కి మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.