Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకుపోతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆత్మగౌరవం, క్రీడా స్ఫూర్తి, భావోద్వేగాలను సమర్థవంతంగా ఆవిష్కరించిన దర్శకుడు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అద్భుతమైన విజువల్స్‌ను అందించారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. రామ్ చరణ్ గత చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ‘పెద్ది’పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ హిట్‌గా ‘పెద్ది’ నిలిచింది. సినిమా సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్రబృందం ప్రత్యేకంగా ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ నిర్వహించనుంది. జూన్ 23న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ గ్రాండ్ సెలబ్రేషన్ జరగనుంది. అభిమానుల సమక్షంలో నిర్వహించనున్న ఈ వేడుకకు చిత్రబృందం మొత్తం హాజరుకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డం, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో ‘పెహల్వాన్’ అవతారంలో రామ్ చరణ్ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.‘PEDDI 27’ జెర్సీ, చేతిలో గోల్డ్ మెడల్‌తో కనిపించిన చరణ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.