Payal Rajput | ‘వాడెవడో తెలీదు.. కానీ ఎలాంటివాడో తెలుసు.. ఇప్పటివరకూ నేను కచ్చితంగా వాడ్ని కలవలేదు. ఏరోజు కలుస్తానో.. అదే వాడి ఆఖరు రోజు’ అని వార్నింగ్ ఇస్తున్నది పాయల్ రాజ్‌పుత్. ఇంతకీ అంత స్ట్రాంగ్ వార్నింగ్ పాయల్ ఎవరికి ఇస్తున్నది? ఎందుకు ఇస్తున్నది? ఆమె వెతికేది ఎవర్ని? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘రక్షణ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్.
ఆయన దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పాయల్‌రాజ్‌పుత్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రక్షణ’. ప్రకాశ్ జోసెఫ్, రమేశ్‌రెడ్డి, నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా మంగళవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో సాగింది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్నానని, నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. రోషన్, మానస్, రాజీవ్‌కనకాల, వినోద్‌బాల తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: మహతిసాగర్.