Manoj paramahamsa | తమిళనాడు ప్రభుత్వం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు ప్రతిష్టాత్మక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (TNMGRFTI) ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం సినీ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. తాజాగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పరమహంస, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్టును పంచుకున్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తన పోస్టులో మనోజ్ పరమహంస మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మీకు వ్యక్తిగతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేవాడిని. కానీ ఈ ఏడాది ప్రత్యేకమైనది. నన్ను ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమించి ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ఈ అవకాశాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను అని పేర్కొన్నారు. అలాగే అంకితభావంతో, నిజాయితీతో సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, విద్యాసంస్థకు మధ్య బలమైన సాంకేతిక వారధిని నిర్మించడం, ఎంజీఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
మనోజ్ పరమహంస నియామకంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు సేవలందించిన ప్రతిభావంతుడైన ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ బాధ్యతలకు పూర్తిగా అర్హుడు. ఆయన నాయకత్వంలో మరెంతో మంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తయారవుతారని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.కాగా, మనోజ్ పరమహంసకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ నటించిన ‘స్నేహితుడు’, ‘బీస్ట్’, ‘లియో’ వంటి చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాల విజయంలో ఆయన విజువల్ వర్క్ కీలక పాత్ర పోషించింది.అలాగే తెలుగులో ‘ఏ మాయ చేసావే’, ‘రేసుగుర్రం’, ‘కిక్ 2’, ‘బ్రూస్ లీ’, ‘రాధేశ్యామ్’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా సేవలందించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలకు కూడా ఆయన పనిచేసారు.