Remakes | పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయితన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అయితే పవన్ తన కెరీర్లో ఎక్కువగా రీమేక్స్ చేశారు. తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `ఖుషి` చిత్రం కూడా రీమేక్. వీటితోపాటు `సుస్వాగతం`, `అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి`, `గోకులంలో సీత`, `గబ్బర్ సింగ్`, `తీన్ మార్`, `అన్నవరం`, `గోపాల గోపాల`, `కాటమరాయుడు`, `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`, `బ్రో` వంటి చిత్రాలని పవన్ రీమేక్ చేశారు. ఆయన స్ట్రైటగా చేసిన చిత్రాలు పెద్ధగా ఆడకపోవడంతో రీమేక్స్ చేశారు. అయితే తాను రీమేక్స్ చేయడం వెనక కారణాన్ని తాజాగా వెల్లడించారు పవన్
నేను రీమేక్స్ చేశానని అంతా తిడుతున్నారు. అసలు నేను అనుకోకుండా హీరో అయ్యాను, రికార్డులు బ్రేక్ చేయాలని, సంచలనాలు క్రియేట్ చేయాలని ఏనాడు సినిమాలు చేయలేదు. నా దృష్టి ఎప్పుడూ కూడా సమాజంపై, జనాలపై, వారికి మంచి పనులు ఎలా చేయాలనే వాటిపైనే ఉంటుంది. నా లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు బడా డైరెక్టర్స్ రారు కాబట్టి రీమేక్స్ చేయాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. సొంత కథలతో సినిమాలు చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు, వాటిలో చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. అందువలనే తాను రీమేక్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు తాను డబ్బుల కోసమే రీమేక్ సినిమాలు చేసినట్టు వెల్లడించారు.
రీమేక్‌లు చేస్తే త్వరగా సినిమా పూర్తి అవుతుంది. డబ్బులు కూడా వస్తాయి..తన భార్యాపిల్లలను పోషించడానికి ఉంటుంది, పార్టీని నడపొచ్చు. అందుకే వేరే దారి లేక రీమేక్‌లు చేశానని వెల్లడించారు పవన్. ఇలాంటి తరుణంలో నాతో మంచి సినిమా చేయాలని, గొప్ప కథ చెప్పాలని `హరి హర వీరమల్లు` కథతో నిర్మాత ఏఎంరత్నం వచ్చారని, ఈ సినిమా ఒక గొప్ప సినిమా అవుతుందంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ చిత్రం నచ్చితే రికార్డులు బ్రేక్ చేయండి అని ఆయన అన్నారు. క్రిష్ మంచి కథతో ఈ సినిమాని మొదలు పెట్టగా, పలు కారణాల వలన ఆయన తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ చిత్రాన్ని పూర్తి చేశాడు.జులై 24న చిత్రం విడుదల కానుంది.