అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగు చిత్ర పరిశ్రమపై ( Film Industry ) సంచలన వ్యాఖ్యలు చేశారు. . ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా ? సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మా అసోసియేషన్ మరిచినట్లున్నాయని ఎద్దేవా చేశారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిప్ట్నకు కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు. సినీరంగం అభివృద్ధినే చూస్తుందని వెల్లడించారు.
అందరూ కలిసి రావాలన్న సూచనలకు సానుకూలంగా స్పందించలేదని ఆరోపించారు. ఏపీలో రూ. కోట్ల పెట్టుబడులతో నిర్మించే చిత్రాలను ప్రోత్సాహిస్తామని చెప్పాం. సృజనాత్మక వ్యాపారంలో ఉన్నవారి గౌరవానికి భంగం వాటిల్లకూడదని చెప్పామని , కొన్ని సినిమాల విడుదలకు ముందు టికెట్ల ధరను పెంచామని గుర్తు చేశారు.
కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు విడుదలకు ముందు తమ డిమాండ్ల సాధనకు సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన మేరకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.