కొద్దిరోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ‘హరిహరవీరమల్లు’ చిత్రం మరోమారు వాయిదా పడింది. ఈ విషయాన్ని శుక్రవారం చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఎం.ఎం.జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. గ్రాఫిక్ వర్క్స్‌లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నందున రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘కష్టమైనప్పటికీ తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలన్నదే మా ప్రయత్నం. అందుకే కొంత సమయం తీసుకుంటున్నాం.
మీ ఎదురుచూపులకు బహుమతిగా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తాం. త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తాం. కొత్త తేదీని కూడా ప్రకటిస్తాం’ అని చిత్రబృందం ప్రకటనలో పేర్కొంది. మొఘల్ కాలం నాటి ఈ కథలో పవన్‌కల్యాణ్.. పెద్దల దగ్గర సంపదను కొల్లగొట్టి పేదలకు పంచే బందిపోటు దొంగ వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస.