Pawan Kalyan |ప్రముఖ మలయాళ నటుడు, భారతీయ సినీ పరిశ్రమకు అమూల్యమైన సేవలు అందించిన మోహన్‌లాల్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత సినీ గౌరవం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కడం సినీ ఇండస్ట్రీలో ఆనందోత్సాహాలను నింపింది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 20న అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్‌లాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా మోహన్‌లాల్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
“ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరం. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే మోహన్‌లాల్ ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్న ఆయన, తెలుగులో కూడా ‘ఇద్దరు’, ‘కంపెనీ’, ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో మనల్ని అలరించారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న పాత్రల్లో ఆయనను చూడాలన్న ఆకాంక్ష ఉంది,” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.మోహన్‌లాల్‌కు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సహనటుడు మమ్ముట్టి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత సినిమా రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు ఇది గొప్ప గౌరవం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
1978లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్, నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. మలయాళ సినిమాలకు మాత్రమే కాకుండా తమిళ, హిందీ, తెలుగు భాషల్లోనూ తన ముద్ర వేశారు. ఆయనకు పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2019) వంటి ప్రస్థాన గౌరవాలు కూడా లభించాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ద్వారా మోహన్‌లాల్ సినీ జీవితం మరింత వెలుగొందనుంది. మోహన్‌లాల్ అసలు పేరు మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్. 1960 మే 21న కేరళలోని పతనంతిట్టలో ఆయన జన్మించారు