తెలుగురాష్ర్టాల్లో విశేషమైన అభిమానగణం ఉన్న కథానాయకుడు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, పొత్తులో భాగంగా ఆ రాష్ర్టానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం కృషిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఆయనపై ఉంది. మరోవైపు పవన్‌కల్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్త కూడా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నది. అయితే.. ఆయన హీరోగా మూడు సినిమాలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘హరిహరవీరమల్లు’.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75శాతం పూర్తయింది. ఇక రెండో సినిమా ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60శాతం కంప్లీట్ అయ్యింది. మూడో సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 30శాతం పూర్తయింది. ఈ సినిమాలకు సంబంధించిన పవన్‌కల్యాణ్ వెర్షన్స్ వరకూ యుద్ధప్రాతిపదికన తీసినా కనీసం ఏడెనిమిది నెలలైన పడుతుంది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కల్యాణ్ ఏకబిగిన ఏడెనిమిది నెలలు డేట్స్ ఇవ్వడం కుదిరేపనికాదు. కాబట్టి, ప్రస్తుతానికి రెండుపడవలపై కాళ్లు వేయాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వందకోట్ల వరకూ పారితోషికం తీసుకునే స్టార్డమ్ పవన్ సొంతం. అలాంటి స్టార్‌డమ్‌నీ, ఆదాయాన్ని వదులుకొని రాజకీయాలకే పరిమితమవుతారా? లేక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధిలా ఓ వైపు రాష్ట్రమంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, మరోవైపు సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తారా? ఇంతకీ అసలు పవన్ మనసులో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.