ఇటీవలే ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్. దీంతో ఆయన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు ‘గబ్బర్‌సింగ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్‌శంకర్ రూపొందిస్తున్న చిత్రమిది కావడంతో.. మళ్లీ అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో తన షూటింగ్ పోర్షన్‌ను కంప్లీట్ చేశారు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం ఇతర తారాగణంపై హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రచారంలోకి వచ్చింది.
వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, రాశీఖన్నా, పార్థీబన్, కె.ఎస్.రవికుమార్, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.