తన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ విషయంపై చిరంజీవి మాట్లాడుతూ ‘కల్యాణ్‌బాబుకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. తను కోలుకుంటున్నాడు. సాధారణ స్థితికి వచ్చేందుకు ఓ వారం రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. నా తమ్ముడి ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని చిరంజీవి తెలిపారు.
పవన్‌కల్యాణ్ శుక్రవారం పాలనాపరమైన అంశాలను అధికారులతో చర్చస్తూ హటాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించి పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు పవన్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. కనీసం పదిరోజులైనా ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరోవైపు పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అగ్ర హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో పాటు సాయిదుర్గతేజ్, కోన వెంకట్ తదితరులు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. ప్రధాని మోదీ ఫోన్లో పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌గారు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నాం. ఆయన పూర్తి శక్తిని పుంజుకుని, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంతో ప్రజాజీవితంలోకి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం’ అని ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు.