Pawan Kalyan | ఇప్పుడున్న హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితం కావడం లేదు. మిగిలిన విభాగాల్లోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే.. మరికొందరు సొంతంగా కథలు రాసుకుంటున్నారు. అయితే ఈ ఆచరణ ఇప్పుడేం కొత్తగా పుట్టుక రాలేదు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోలు నటనతో పాటుగా దర్శకత్వ భాద్యతలు కూడా చేపట్టేవారు. అంతేకాకుండా అప్పటి హీరోలు వాళ్ల సినిమాలకు స్వయంగా కథలు కూడా రాసుకునేవారు.
కాగా తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాకు తానే కథను రాసుకోవడానికి సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ తెరకెక్కాల్సి ఉంది. మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆగిపోయింది.
కాగా తాజాగా పవన్, హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. అయితే ముందుగా అనుకున్న కథ కాకుండా కొత్త కథతో సినిమా తెరకెక్కించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా కథను అందించనున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక పవన్ గతంలో ‘జానీ’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలకు రచయితగా పనిచేశాడు.