Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరై, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం, సోమవారం రాత్రి నుంచి జ్వరం మరింతగా పెరగడంతో వైద్యులు ఆయనను పరీక్షించారు. అవసరమైన చికిత్స అందిస్తూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆయన శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో జరిగిన ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభిమానులను నిరాశపరచకుండా వానలో తడుస్తూనే ఆయన స్టేడియంలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్‌తో ఫ్యాన్స్‌కి మంచి కిక్ వచ్చింది. అనంతరం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వర్షంలో తడవటం, బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్ సోకినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, పవన్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ప్రీమియర్ షో కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. 24వ తేదీ రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించగా, అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతి లభించింది. తెలంగాణలో కూడా ప్రత్యేక షోలకు అనుమతులు లభించాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించి అలరించాడు.