అగ్రహీరో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రానున్న పానిండియా ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఇందులో పవన్‌కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ. మెగా సూర్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం సమర్పణలో, ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత మార్చి 28న విడుదల చేయాలని భావించారు. కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు మిగిలివున్నందున మే 9న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.
ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తెచ్చే వీరమల్లుగా మునుపెన్నడూ చూడని కొత్త అవతార్‌లో ఇందులో పవన్‌కల్యాణ్ కనిపిస్తారని, అలాగే ప్రేక్షకుల హృదయాలను కూడా ఆయన దొంగిలిస్తాడని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడు. అనుపమ్‌ఖేర్, జిఘ సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రాఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.