Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు మంచి స్పందన పొందగా.. తాజాగా విడుదలైన “దేఖ్ లేంగే సాలా (Dekh Lenge Saala)” సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇప్పటివరకు ఉన్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని “చికిరి” సాంగ్ రికార్డ్‌ను బ్రేక్ చేసి, ‘దేఖ్ లేంగే సాలా’ టాప్‌లో నిలిచింది. ఈ పాటకు వచ్చిన అద్భుత స్పందనకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ స్టెప్పులతో అభిమానులను ఫిదా చేశారు. ఈ విజయానికి దర్శకుడు హరీష్ శంకర్‌కే క్రెడిట్ దక్కుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు. అభిమానులు పవన్ నుంచి ఏం ఆశిస్తున్నారో పక్కా ప్లానింగ్‌తో ఈ సాంగ్‌ను డిజైన్ చేయడం వల్లే ఈ రేంజ్లో హిట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఒక్క సాంగ్‌తోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమా కూడా ఈ పాట తరహాలోనే భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం 2026 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాంగ్‌తోనే రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్, సినిమాతో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.