Pawan Kalyan | మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంది. ఇక సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ , నిర్మాత ఏఎం రత్నం వరుస ప్రమోషన్లు చేసారు. అయితే తనకెంతో ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం కోసం పవన్ కళ్యాణ్ తన పాత పంథాని పక్కన పెట్టుకుని చానాళ్ల తర్వాత మీడియా ముందుకు రావడం విశేషం. ప్రెస్మీట్లో తన మనసులోని భావాలను పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించిన ఆయన, ఈ ప్రాజెక్ట్ పట్ల తన కమిట్మెంట్, ఇండస్ట్రీపై తన ప్రేమను మరోసారి చాటారు
“సినిమా బతకాలి” అన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశానని పవన్ స్పష్టం చేశారు. ప్రీ-రిలీజ్ తర్వాత ఈ అవకాశం దక్కుతుందో లేదో తెలియక, తన మనసులోని భావాలను పంచుకోవాలని అనిపించిందన్నారు. ఈ సినిమా ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో సాగిందని పవన్ తెలిపారు. కరోనా విజృంభించిన సమయంలో, షూటింగ్ స్తంభించడంతో పాటు పలు సాంకేతిక, ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయన్నారు. దర్శకుడు క్రిష్, రచయిత సాయిమాధవ్ బుర్రా తపన చూసి, రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేశాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశా. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లు అందరికీ ప్రేరణ కలిగిస్తాయి అని పవన్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా కోసం నిర్మాత ఎదుర్కొన్న కష్టాలను చూసి, తన వంతు బాధ్యతగా ఈ సినిమాను చేయాలని భావించానని పవన్ తెలిపారు. నిర్మాత కనుమరుగు కాకూడదు అనే ఉద్దేశంతో నాపై నాకున్న గౌరవంతో, ఇండస్ట్రీపై ప్రేమతో ఈ సినిమాను చేశా అన్నారు. కథలోని ప్రధాన అంశం .. కోహినూరు వజ్రం విజయవాడ జిల్లా కొల్లూరు నుండి ఎలా అనేది సినిమాకి కీలకంగా మారనుంది. ఇది సినిమాకు బలమైన పాయింట్ అవుతుందని పవన్ వివరించారు. సంగీత దర్శకుడు కీరవాణి ఎంతో ఎనర్జీతో ఈ సినిమాకు సంగీతాన్ని అందించారని చెప్పారు. “ప్రతిసారి ఈ సినిమా పూర్తి అవుతుందా లేదా అనిపించినప్పుడు, కీరవాణిగారి సంగీతమే ప్రాణం పోసింది,” అంటూ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ నన్ను అన్నం పెట్టిన ఇండస్ట్రీని మర్చిపోలేను. సినిమాపై గౌరవం గల వ్యక్తిగా, ఈ సినిమా కోసం మీ ముందుకు వచ్చాను అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా చెప్పారు.ఇక నిధి ఈ సినిమా కోసం పడ్డ కష్టం చూసి నాకే సిగ్గుగా అనిపించిందని పవన్ అన్నారు.