Pawan Kalyan | రాజకీయంగా పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ రెండు విభిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు. ప్రకాశ్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా పవన్‌పై విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. అయితే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ఓజీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్నది. వీరి మధ్య ఉన్న రాజకీయ విభేదాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విమర్శలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో పవన్ వ్యక్తిగత విషయాలపై కూడా విమర్శలు చేశారు. ఫలితంగా పవన్ అభిమానుల్లో ప్రకాష్ రాజ్ పట్ల ఉన్న వ్యతిరేకత మరింత పెరిగింది.
అయితే ఇదంతా ఉన్నా కూడా ఈ ఇద్దరూ కలిసి ఓజీ సినిమాలో నటించడం ఆషామాషి కాదు, కథలో కీలక పాత్రలు పోషించి సినిమాలో మెయిన్ పిల్లర్లుగా నిలవడం చిత్ర ప్రేక్షకులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సత్యదాదా పాత్రలో ప్రకాష్ రాజ్, అతని రక్షకుడిగా గంభీర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటనకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ రెండు పాత్రల చుట్టూనే మొత్తం కథ తిరుగుతూ, సినిమాకు బలమైన ఎమోషనల్ బేస్‌గా నిలిచాయి.అంతేకాకుండా, సాధారణంగా సినిమాల ప్రమోషన్లకు హాజరుకాని పవన్ కళ్యాణ్, అక్టోబర్ 1న జరిగిన ఓజీ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్‌కి హాజరై, ప్రకాష్ రాజ్ గురించి చెప్పిన మాటలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.
నా పొలిటికల్ అభిప్రాయాలు బలంగా ఉంటాయి. అలాగే ఇతరులకీ వారి అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సినిమా అంటే నాకు అమ్మ లాంటిది. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది సినిమా. ఎవరి రాజకీయ అభిప్రాయాల వల్ల నేను నటించడానికి వెనకడుగు వేయను. నేను ఒక్కటే కోరుకున్నాను. సెట్లో పొలిటికల్ టాపిక్స్ వద్దు. ఆయన ప్రొఫెషనల్‌గా ఉంటే, నేనూ అలాగే ఉంటా,” అని పవన్ తన స్పీచ్‌లో చెప్పడం గమనార్హం. ప్రకాశ్ రాజ్‌ను “బ్రిలియంట్ యాక్టర్” అని అభివర్ణించిన పవన్ కళ్యాణ్, మా మధ్య ఏమైనా ఉంటే అవి వేరే చోట మాట్లాడుకుంటాం కానీ.. ఇక్కడ కాదు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే యాక్ట్ చేస్తారా అని అడిగారు.. నాకు ఇబ్బంది లేదని చెప్పాను అని పవన్ అన్నారు. పవన్ కామెంట్స్ తో వీరి మధ్య ఉన్న వైరుధ్యం తగ్గుతుందా? వ్యక్తిగత విమర్శలకు ముగింపు వస్తుందా? అనేది వేచి చూడాల్సిన విషయం.