Pawan Kalyan | టాలీవుడ్ దిగ్గజం కమల్ హాసన్‌ని ఆస్కార్ అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే . ఎన్నో దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగంలో అనేక అవార్డులు, జాతీయ, రాష్ట్ర, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న కమల్ హాసన్‌కి ఈ గౌరవం దక్కడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు స్వాగతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ కూడా కమల్ హాసను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ క్షణం భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన క్షణం అంటూ పవన్ సంతోషం వ్యక్తం చేశారు.
కమల్ హాసన్ కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి ఫిలిం మేకర్ అని అన్నారు. రచన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు సహా సినిమాలోని ప్రతి అంశంపై ఆయనలో ఎంతో నైపుణ్యం ఉంది. కమల్ హాసన్ ఆరు దశాబ్దాల విశిష్ట కెరీర్‌ను ప్రస్థావిస్తూ, పవన్ ఆయనను నిజమైన కళాఖండంగా అభివర్ణించడం జరిగింది. మిస్టర్ హాసన్ ప్రభావం జాతీయ సరిహద్దులకు మించి విస్తరించింది. నటుడిగా, కథకుడిగా , దర్శకుడిగా ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ సినిమా సహా ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపిందంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రంలో రాసుకొచ్చారు.
ఇక కమల్ హాసన్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులలో ఒకరిగా ఎంపికయ్యారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన 2025 సభ్యత్వ జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కడం విశేషం. భారతీయ సినీ రంగానికి ఇది మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, ఈ ఇద్దరు నటుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని పలువురు కామెంట్స్ చేశారు. వీరితో పాటు స్టార్ డైరెక్టర్ పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా అస్కార్ అకాడమీకి ఎంపికయ్యారు.ఈ జాబితాలో మొత్తం 534 మందికి సభ్యత్వ ఆహ్వానం అందగా, అందులో 19 విభాగాలకు చెందిన నిపుణులకు చోటు దక్కింది. కొత్తగా ఆహ్వానం పొందిన వారిలో 41 శాతం మహిళలు ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుక జరగనుంది.