OG | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా “ఓజీ” ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాగా, తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి. పవన్ గత చిత్రాల కంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, అభిమానులు ప్రీమియర్ల కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు కాసారు. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రీమియర్ షోలకి టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.
ప్రత్యేకంగా విజయవాడ శివారు ప్రాంతంలో 60కి పైగా ప్రీమియర్ షోలు పడినట్టు సమాచారం, ఇది సినిమా క్రేజ్‌కి నిదర్శనం. కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ టిక్కెట్లను బ్లాక్ చేసి, ఆఫ్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయించారంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే నైజాం ఏరియాలో ఏకంగా 366 ప్రీమియర్ షోలు వేయడం, టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి. అన్ని థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం విశేషం. అభిమానులు థియేటర్ల దగ్గర సంబరాల్లో మునిగిపోయారు. “నైజాం అంటే పవన్ అడ్డా” అంటూ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.
ప్రీమియర్ షోల తర్వాత సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తున్నా, ఫ్యాన్స్ మాత్రం సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు. పవన్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో దర్శనం ఇవ్వగా, ఆ పాత్రకు ఆయన న్యాయం చేశాడని, దర్శకుడు సుజీత్ పవన్‌కి ఫ్యాన్‌బాయ్‌లా చూపించి సినిమా తీర్చిదిద్దాడని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు తమన్ సంగీతం సినిమాకి అదనపు బలంగా నిలిచిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. “ఈ సినిమా పవన్ కళ్యాణ్ కోసం, పవన్ ఫ్యాన్స్ కోసం పవన్ అభిమాని తీసిన సినిమా! ,OGని ఆపడం ఎవరి తరం కాదు – యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వవచ్చు, కానీ కలెక్షన్ల ఊపు ఆగదు! అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ‘ఓజీ’ ప్రీమియర్ షోలతోనే పలు రికార్డులను బద్దలుకొట్టింది.