Pawan Kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘They Call Him OG’ (ఓజీ) మూవీ షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.తాజాగా, ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా , టీం నుండి వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్, ఇతర బృంద సభ్యులు కనిపిస్తున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి అందరు ఇలా ఫొటో దిగడం చాలా సంతోషంగా ఫీలవుతున్నారు.ఇదొక ప్రత్యేక క్షణమని అంటున్నారు.
చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అలాగే శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్ వంటి బలమైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సంగీతం కూడా ఓజీకి స్పెషల్ హైలైట్ కానుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది. ఈ చిత్రం పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందా అన్న ఉత్కంఠ టాలీవుడ్‌లోనూ, రాజకీయంగా ఆయన అభిమాన వర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారని, ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్‌గా వస్తారని టాక్.