పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రాన్ని జూలై 24న విడుదల చేస్తున్నట్లు శనివారం మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. చిత్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో విడుదల విషయంలో జాప్యం జరిగిందని గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఇకపై ఎలాంటి వాయిదాలు ఉండొద్దని అభిమానులు కోరుకుంటున్నారు.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. మొఘల్ కాలం నాటి ఈ కథలో పవన్‌కల్యాణ్.. పెద్దల దగ్గర సంపదను కొల్లగొట్టి పేదలకు పంచే బందిపోటు దొంగ వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్ తదితరులు చిత్ర తారాగణం.