సినిమా పేరు : హరిహర వీరమల్లు
తారాగణం : పవన్‌కల్యాణ్, నిధి అగర్వాల్, బాబీడియోల్, సత్యరాజ్..
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: ఏ.దయాకరరావు
సమర్పణ: ఏ.ఎం.రత్నం
పవన్‌కల్యాణ్ అనే పేరు వింటేనే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఇక చెప్పేదేముంది! రెండు తెలుగు రాష్ర్టాల్లో జాతరే. ఇక అంచనాలైతే ఆటోమేటిగ్గా ఆకాశంలోనే ఉంటాయి. అయిదేళ్లపాటు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ఎట్టకేలకు గురువారం పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూసీ చూసీ.. చివరికి విసిగిపోయారు. దాంతో అంచనాలు కాస్త తగ్గాయి. అయితే.. ఎప్పుడైతే ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పవన్ పాల్గొనడం మొదలుపెట్టారో.. అప్పట్నుంచీ మళ్లీ అమాంతం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులైతే ధియేటర్లకు పోటెత్తారు. మరి ఊరించీ ఊరించీ.. ఇంత ఆలస్యంగా విడుదలైన ‘హరిహర వీరమల్లు’ అభిమానుల అంచనాలను అందుకున్నాడా? లేక ఊసూరు మనిపించాడా? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..
కథ
తండ్రి షాజహాన్ నుంచి రాజ్యాధికారాన్ని బలవంతంగా లాక్కుని నిరంకుశంగా ఔరంగజేబు పరిపాలిస్తున్న రోజులవి. ప్రజలపై జిజియా పన్నును విధించి, ఇస్లాంమత వ్యాప్తికోసం, హిందూమతాన్ని నిర్వీర్యం చేస్తూ ఇష్టారీతిన పరిపాలిస్తున్నాడు ఔరంగజేబు. మరోవైపు తెలుగు నేలపై అనాధగా నీటిలో కొట్టుకొచ్చిన ఓ బిడ్డను దైవాంశగా భావించి, ‘హరిహర వీరమల్లు’ అని నామకరణం చేసి పెంచుకుంటారు ఓ సనాతనులు. ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఓ రాబిన్‌హుడ్‌గా మారతాడు. ఉన్నవాళ్లను కొట్టి, లేని వాళ్లను పెట్టే వీరమల్లు చోర సామర్థ్యం విన్న గోల్కొడ నవాబు అతనికి ఓ భయంకరమైన బాధ్యతను అప్పజెపుతాడు. అదే ‘కోహినూర్’. కొల్లూరు వజ్రపు గనుల్లో పుట్టి, గోల్కొండ నవాబు నుంచి చివరికు మొగల్ సింహాసనంపైకి చేరిన ఆ విలువ కట్టలేని వజ్రాన్ని ఎలాగైనా అపరహరించి తీసుకురావాలనేదే ఆ బాధ్యత. చావుకు తెగించి వీరమల్లు తన అనుచరులతో ఢిల్లీ బయలుదేరతాడు? తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఇది నిజంగా కొత్త కథ. గతంలో హిస్టారికల్ ఫిక్షన్ సినిమాలు రెండుమూడు వచ్చాయి. కానీ ఈ తరహా జానర్ మాత్రం రాలేదు. అయితే.. హీరో పాత్ర చిత్రణ పాతదే. దర్శకుడు క్రిష్ చాలా కొత్తగా ఆలోచించి ఈ కథ రాసుకున్నారు. ఓ రాబిన్‌హుడ్ లాంటి క్యారెక్టర్, ఔరంగజేబు లాంటి ఓ భయంకరమైన శక్తిని ఢీకొంటే ఎలా ఉంటుంది? అనే ఊహే అద్భుతం. కాకపోతే.. దాన్ని తెరకెక్కించే విషయంలో ఓ మథనమే జరిగిందని చెప్పాలి. ‘సనాతన ధర్మం’ అనే కాన్సెప్ట్ ఈ కథలో భాగం కావడం అందులో భాగమే. నిజానికి కూడా సనాతనధర్మం అంటే కాసులు రాలుతున్న రోజులివి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నమే చేశారు. పవన్‌కల్యాణ్ లాంటి పొలిటికల్ స్టార్ ఇలాంటి కథను భుజాలకెత్తుకోవడం కూడా సినిమాకు కొంతవరకు ప్లస్ అయ్యింది. ఔరంగజేబు లాంటి అత్యంత శక్తిమంతుడ్నీ, మతోన్మాదినీ విలన్‌గా చూపించి.. అతని మొగల్ సామ్రాజ్యాన్ని మట్టుపెట్టేందుకు మహారాజే రానక్కర్లేదు.. ఓ సామాన్యుడు చాలు అంటూ హీరోను ఎంటర్ చేశాడు దర్శకుడు. ఔరంగజేబు రూపంలో హీరోకు పెద్ద టాస్క్ ఇచ్చేశాడు. ఆ తర్వాతా.. ఆ సమస్య ముందుకు హీరో వెళ్లేందుకు పరిఢమిల్లిన సందర్భాలు, సంఘటనలు ఆసక్తిగానే సాగాయి. సినిమా విజయంపై నమ్మకాన్ని కూడా పెంచాయి. కంటి చూపుతో క్రూర మృగాలను సైతం మచ్చికచేసుకునే సామర్థ్యం, అన్ని విద్యాల్లోనూ ఆరితేరిన గుణం, నమ్మిన ధర్మం కోసం ప్రాణాలను త్యజించే ధైర్యం, నమ్మిన జనం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని తెగువ.. ఇవన్నీ హీరో పాత్రలో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు.
ఇక ద్వితీయార్ధం విషయానికొస్తే.. ఔరంగజేబు కలిసేందుకు అనుచరులతో ఢిల్లీ పయనమవుతాడు హీరో. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సమస్యలే సినిమా అంతా. ఓ విధంగా ఈ ప్రయాణమంతా ఫైట్లతో పాటలతో కానిచ్చేశాడు దర్శకుడు జ్యోతికృష్ణ. సెకండాఫ్‌లో సనాతనధర్మాన్ని కాపాడే క్రమంలో ఓ భారీ యుద్ధం ఉంటుంది. అది తప్ప.. తతిమా ప్రయాణం అంత సవ్యంగా సాగినట్టు అనిపించదు. వీరమల్లు సైన్యం నలుగురు వ్యక్తులు. వారిలో ఇద్దరు కామెడీకి తప్ప దేనికీ పనికిరారు. అలాంటివారితో ఔరంగజేబును ఢీకొట్టేందుకు ఓ దొంగ వెళ్లడం కామెడీగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఫైట్లకు కొదవే లేదు. వీరమల్లు ప్రతి సన్నివేశంలో ఫైటు చేస్తూనే ఉన్నాడు. కానీ డ్రామ మాత్రం కనిపించదు. ఒకవేళ ఉన్నా అది పండదు. డ్రామా అనేది పండితేనే పోరాటాలు రక్తి కడతాయి. ఎమోషన్స్ లేని పోరాటలు ఉప్పులేని పప్పుతో సమానం. ఈ కథలో ‘హరిహర వీరమల్లు’కు ఓ వ్యక్తిగత ఎజెండా కూడా ఉంటుంది. కానీ.. దానికోసం అతను దొంగే కానవసరం లేదు. ఇలాంటి అర్థంకాని ప్రశ్నలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. మొత్తంగా ఔరంగజేబును వీరమల్లు కలవగానే సెకండ్ పార్ట్ కోసం సినిమాను ముగించేశారు. ఇక జరిగేదంతా యుద్ధమే అనేలా ‘యుద్ధభూమి’ అంటూ సెకండ్ పార్ట్ కోసం ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
నటీనటులు
పవన్‌కల్యాణ్ వీరమల్లుగా విరుచుకుపడ్డాడు. నటనకు గ్యాప్ వచ్చినా.. అతనిలో జోష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పోరాటాల్లో కూడా మంచి ఈజ్ కనపరిచారు. నటన పరంగా కూడా తనదైన ైస్టెల్‌తో అభిమానుల్ని అలరించారు. బాబీడియోల్ ఔరంగజేబుగా ఆకట్టుకున్నారు. చక్కగా నటించారు కూడా. ఇక నిధి అగర్వాల్ పాత్రలో విభ్నిమైన కోణాలున్నాయి. ఉన్నంతలో తను కూడా బాగానే నటించింది. ఇక సత్యరాజ్, నాజర్, సునీల్.. అందరూ తమ పాత్రల్ని రక్తికట్టించారు.
సాంకేతికంగా..
కథలోని కొత్తదనం ఈ సినిమాకు ప్లస్. కథనం విషయంలో జాగ్రత్త పడితే బావుండేది. క్రిష్ నుంచి జ్యోతికృష్ణ చేతికి సినిమా వచ్చినట్టుగా ఆ తేడా తెరపై ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక విఎఫ్ఎక్స్ అయితే కొన్ని కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా ఇబ్బందిగా అనిపించాయి. గుర్రంపై హీరో ప్రయాణించే చిన్నచిన్న సీన్లలో కూడా సీజీలు పేలవంగా అనిపించాయి. ైక్లెమాక్స్‌లో తుఫాన్ సృష్టించడం మంచి ఆలోచనేకానీ.. సీజీ మాత్రం ఇబ్బందికరంగా ఉంది. పవన్ చెప్పినట్టు ఈ సినిమాకు సంగీతం ప్రాణం. ఎం.ఎం.కీరవాణి ఆర్ఆర్తో సినిమాను నిలబెట్టారు. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం చాలా బావుంది. ఎడిటింగ్ విషయంలో డైరెక్టర్ కాస్త శ్రద్ధ పెడితే బావుండేది.
మొత్తంగా ఫస్టాఫ్ బావుంది.. చూడ్డానికి సెటప్ బావుంది.. అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. పైగా పవన్ లాంటి మాస్ హీరో తోడయ్యాడు.. పైసా వసూల్ పక్కా.
బలాలు
కథ, కీరవాణి ఆర్ఆర్, పవన్ నటన..
బలహీనతలు
కథనం, వీఎఫ్ఎక్స్, ద్వితీయార్ధంలో కొన్ని పేలమైన సన్నివేశాలు..
రేటింగ్: 2.75/5