Pawan Kalyan | ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టం చేశారు. “భవిష్యత్తులో రాజకీయాలా, సినిమాలా?” అనే ప్రశ్నకు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా.. “రాజకీయాలకే నా తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. దాని తర్వాత సినిమాలు అని అన్నారు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే. నాకు అన్నం పెట్టింది, బతుకుదెరువు ఇచ్చింది కూడా సినిమాలే అని పవన్ అన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటికే మూడు సినిమాలు ఆగిపోయాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో, డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నా.
‘హరిహర వీరమల్లు’ సినిమాకు అయితే ఐదేళ్లుగా నిర్మాణం సాగుతోంది. ఈ సినిమాకోసం నిర్మాత ఏఎం రత్నం చాలా త్యాగాలు చేశారు. ఆయన్ను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రమోషన్లలో భాగమవుతున్నా. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాతి విషయం. కానీ మొదట అది రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు.సినిమాలపై ప్రేమ ఉన్నప్పటికీ, ఇకపై నటనకు అంత సమయం కేటాయించలేనని పవన్ చెప్పారు. “ఓ వైపు డిప్యూటీ సీఎం పదవిలో బాధ్యతలు, మరోవైపు జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యం. సినిమాల్లో నటించాలంటే కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది.ప్రస్తుతం నటుడిగా కాకపోయినా, నిర్మాతగా సినిమాల్లో కొనసాగాలని అనుకుంటున్నా.
సినిమాలు నా ఇంధనం. నిర్మాతగా మారితే, ఇండస్ట్రీతో టచ్‌లో ఉండగలుగుతాను. డబ్బులూ వస్తాయి. నాకు వేరే వ్యాపారాలేమీ లేవు కాబట్టి, సినిమాలే దిక్కు అని వివరించారు. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లడం నా టార్గెట్. హరిహర వీరమల్లు సినిమాలో నేను కోహినూర్ వజ్రం కోసం పోరాడే యోధుడిగా కనిపిస్తా. ఇది ఔరంగజేబు హింసా పాలనపై ఆధారపడిన కథ” అని వివరించారు. అయితే పవన్ తాజా వ్యాఖ్యలు ఆయన అభిమానులను కొంత నిరాశపరిచినప్పటికీ, గతంలో కూడా ఇటువంటి ప్రకటనల తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజులలో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!