Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తన మాతృమూర్తి అంజనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. గురువారం విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడ ఉన్న రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణ, ఆహారం, నిర్వహణకు అయ్యే మొత్తం వ్యయాన్ని తానే భరిస్తానని స్పష్టం చేశారు. జనవరి 29న తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కుటుంబపరమైన విలువలను అనుసంధానిస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా జూ ప్రాంగణంలో ఉన్న బటర్‌ఫ్లై పార్కును ఆయన సందర్శించారు. అక్కడ సీతాకోకచిలుకలు తనపై వాలిన దృశ్యం అక్కడున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. పార్కులో ఉన్న వివిధ రకాల సీతాకోకచిలుకలు, వాటి జీవన విధానం, వలల మధ్య వాటికి ఆహారం ఎలా అందిస్తారు వంటి అంశాలపై జూ క్యూరేటర్ మంగమ్మను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ప్రశ్నించి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖ జూలో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అలాగే కంబాలకొండ ఎకో పార్కులో అభివృద్ధి చేసిన నగర వనాన్ని ప్రారంభించి, అక్కడ నిర్మించిన చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. ప్రకృతితో మమేకమవుతూ తీసుకున్న ఈ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి.
జూ నిబంధనలు పాటిస్తూ పవన్ కళ్యాణ్ ఏనుగులు, జిరాఫీలు, పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి ఆహారం అందించారు. జంతువుల పేర్లు, ఆహారపు అలవాట్లు, సంరక్షణ విధానాలపై జూ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి మరియు వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణలో జూపార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరించిపోతున్న జీవజాతులను రక్షించడంలో వీటి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విశాఖ జూపార్క్‌లో వందలాది వన్యప్రాణులు, పక్షులు ప్రశాంతమైన, సహజ వాతావరణంలో జీవిస్తున్నాయని వివరించారు. ప్రజలు తమకు నచ్చిన జంతువును దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలని సూచించారు. తల్లి జన్మదినాన్ని సేవా భావంతో, పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.