Pawan Kalyan | ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత భారతీరాజా మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతీరాజా మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారతీరాజాకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతీరాజా తన అసాధారణ చిత్రాలతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాదు, తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఆయన భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారని కొనియాడారు.
తెలుగు ప్రేక్షకులకు భారతీరాజా అందించిన చిత్రాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భక్తిరస చిత్రం ‘ఆరాధన’, జాతీయ పురస్కారం అందుకున్న ‘సీతాకోకచిలుక’ వంటి చిత్రాలు తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చిత్రాల్లో కనిపించే భావోద్వేగాలు, పాత్రల సహజత్వం, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబం భారతీయ సినిమాకు కొత్త దారులు చూపించాయని గుర్తు చేశారు.
దర్శకుడిగా మాత్రమే కాకుండా కొత్త ప్రతిభను వెలికితీసిన గురువుగా కూడా భారతీరాజా సేవలు చిరస్మరణీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన రూపొందించిన చిత్రాలు ఇప్పటికీ సినీ విద్యార్థులకు, యువ దర్శకులకు పాఠ్యాంశాల్లా మారాయని అన్నారు. భారతీరాజా మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లాంటి మహనీయుడి సేవలను సినీ ప్రపంచం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్నారు. చివరగా భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. “ఓం శాంతి” అంటూ తన పోస్ట్‌ని ముగించారు.