తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సిత్తమ్’ తెలుగు రీమేక్‌లో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
తన పాత్రకున్న ప్రాశస్త్యం దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్‌కల్యాణ్ శాకాహారాన్ని మాత్రమే తీసుకోబోతున్నారని తెలిసింది. అలనాటి హీరోల్లో ఎన్టీఆర్ తాను ఆధ్యాత్మిక, పౌరాణిక పాత్రల్ని పోషించే సమయంలో మాంసాహారాన్ని పూర్తిగా త్యజించేవారు. ఇప్పుడు అదే పంథాను పవన్‌కల్యాణ్ అనుసరిస్తుండటం విశేషం. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలుస్తున్నది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.