Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan)కు శస్త్రచికిత్స జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌కు వైద్య పరీక్షల అనంతరం శనివారం సాయంత్రం సర్జరీ చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్‌లో పంచుకుంది. పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ తమ అధినేత శస్త్ర చికిత్సపై ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పవన్ వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా…
— JanaSena Party (@JanaSenaParty) April 18, 2026
ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయవంతంగా సర్జరీ చేశారు. అయన కోలుకునేందుకు వారం నుంచి పది రోజులు పట్టనుంది. ఆరోగ్యం మెరుగయ్యాక డిప్యూటీ సీఎం అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని వైద్యులు చెప్పారని హరి ప్రసాద్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయం తెలియడంతో ఉపముఖ్యమంత్రి, సినీ హీరో అయిన పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.