Paresh Rawal | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనపై దాఖలు చేసిన దావాపై సీనియర్ నటుడు పరేష్ రావల్ ఎట్టకేలకు స్పందించారు. “హేరా ఫేరీ 3” ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకోవడంపై అక్షయ్ వేసిన దావాకు తన లాయర్ ద్వారా సరైన సమాధానం పంపినట్లు పరేష్ రావల్ వెల్లడించారు. ఈ సమాధానం చదివిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ కంపెనీ “కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్” పరేష్ రావల్పై ఏకంగా ₹25 కోట్ల దావా వేసిన విషయం తెలిసిందే. పరేష్ రావల్ సడెన్గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో తమకు డబ్బు నష్టాలు, అలాగే షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యాయని అక్షయ్ కుమార్ లాయర్ ఆరోపించారు. లాయర్ చెప్పిన దాని ప్రకారం, పరేష్ రావల్ జనవరిలోనే సోషల్ మీడియాలో తాను ఈ సినిమాలో ఉన్నానని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత అగ్రిమెంట్లు చేసుకుని, టీజర్ షూటింగ్లో కూడా పాల్గొన్నారు. కానీ, కొన్ని రోజుల క్రితం, పరేష్ రావల్ సినిమాతో తనకు సంబంధం లేదని, ఇక దానితో ముందుకు వెళ్లదలచుకోలేదని ఒక నోటీసు పంపారని లాయర్ తెలిపారు.
పరేష్ రావల్ తన సినిమాను వదిలేయడానికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ కాదని స్పష్టం చేశారు. డైరెక్టర్ ప్రియదర్శన్పై తనకు చాలా ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నాయని చెప్పారు. “హేరా ఫేరీ” సిరీస్లో బాబురావు గణపత్ రావ్ ఆప్టే పాత్రతో పరేష్ రావల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమా నుంచి తప్పుకోవడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, పరేష్ రావల్ ₹11 లక్షల సైనింగ్ అమౌంట్ను 15% వడ్డీతో తిరిగి ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ దావా కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.