Parada | యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా ‘పరదా’ ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్‌గా అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే, ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, విడుదల సమయంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేకపోయింది. ఫలితంగా నిర్మాతలు ఓటీటీలో త్వరగా విడుదల చేసినట్టు అర్ధమవుతుంది.
ఈ సినిమాకు ‘సినిమా బండి’, ‘శుభం’ ఫేం డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రల్లో నటించారు.ఆనంద మీడియా బ్యానర్ పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ కల్పిత గ్రామమైన పడతిలో నెలకొన్న ఓ పురాతన ఆచారాన్ని కథా నేపథ్యంగా తీసుకుని రూపొందిన ‘పరదా’… ట్రెడిషన్ వర్సెస్ మోడర్నిటీ అనే థీమ్ చుట్టూ నడుస్తుంది. ఆ గ్రామంలో ఆడవాళ్లు “పరదా” కప్పుకోవడం తప్పనిసరి. ఎవరైనా పరదా తీస్తే, గ్రామ దేవత జ్వాలమ్మ ముందే ఆత్మార్పణ చేయాల్సిందన్న కఠిన ఆచారం ఉంది.
ఈ క్రమంలో, అనుపమ పరమేశ్వరన్ పోషించిన సుబ్బు అనే యువతికి పరదా లేకుండా ఉన్న ఒక ఫోటో బయటకు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. సుబ్బు తనపై వచ్చిన అపవాదును తుడిచి వేసేందుకు ధర్మశాలకు వెళ్లడం, అక్కడ ఆమెకు రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) లాంటి వారు కలవడం… తద్వారా ఆ గ్రామపు నిజాల్ని బయటపెట్టే ప్రయత్నం చేయడం ప్రధాన కథాంశం. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌కి వెళ్లలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం. ట్రెడిషనల్ కాన్సెప్ట్‌తో పాటు సామాజిక సందేశం కూడా కలగలిపిన ఈ డ్రామా కథా దృక్కోణంలో విభిన్నంగా నిలుస్తోంది.