నెట్‌ఫ్లిక్స్: డిసెంబర్ 8
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోట్టు, సంజనా సంఘి తదితరులు
దర్శకత్వం: అనిరుద్ధరాయ్ చౌదురి
‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు పంకజ్ త్రిపాఠి. ఆయన ఏ సినిమా చేసినా, వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఏదో కొత్తదనం ఉంటుందనేంత పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘ఓ మై గాడ్ 2’ సినిమాలోనూ పంకజ్ తన నటనతో అదరగొట్టాడు. తాజాగా ఆయన నటించిన ‘కడక్ సింగ్’ జీ5లో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేస్తున్నది. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. ఏకే శ్రీవాస్తవ్ (పంకజ్ త్రిపాఠి) ఆర్థిక నేరాల నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు.
పని విషయంలో రాజీపడడు. ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గడు. విధి నిర్వహణలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఇంట్లో స్ట్రిక్ట్‌గా ఉండేసరికి కుటుంబసభ్యులు అతణ్ని కడక్ సింగ్ అని పిలుస్తుంటారు. రొటీన్‌గా సాగుతున్న అతని జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒకరోజు కడక్ సింగ్ ఆత్మహత్యకు యత్నిస్తాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు నిలుస్తాయి. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతాడు. స్పృహలోకి వచ్చేసరికి గతంలోని కొన్ని సంఘటనలు మర్చిపోతాడు. తనకు కొడుకు, కూతురు ఇద్దరున్నా.. కూతురున్న సంగతి గుర్తుకురాదు.
భార్య చనిపోయిన సంగతీ మర్చిపోతాడు. కడక్ సింగ్ కూతురు సాక్షి (సంజనా సంఘి) తండ్రికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ క్రమంలో అతని జీవిత కథంతా చెబుతుంది. ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కొన్ని గంటల ముందు ఊహించని పరిస్థితుల్లో కూతురు కంట పడతాడు కడక్ సింగ్. ఆ సమయంలో కూతురు అతణ్ని పదిమంది ముందు నిలదీస్తుంది. అదే రోజు కడక్ సింగ్ ఆత్మహత్యకు యత్నించడం, గతాన్ని మర్చిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే, సాక్షి మాత్రం తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నమ్ముతుంది. అతణ్ని ఎవరో హత్య చేసేందుకు ప్రయత్నించారని అనుమానిస్తుంది. ఇంతకీ, కడక్ ఆత్మహత్యకు యత్నించాడా, అతణ్ని ఎవరైనా హత్య చేయాలనుకున్నారా, అతనికి గతం పూర్తిగా గుర్తొచ్చిందా అన్నది మిగిలిన కథ.