Palash Muchhal | ఇండియన్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ తనపై వస్తున్న సంచలన ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తూ న్యాయపోరాటానికి దిగారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన నటుడు, నిర్మాత విద్యన్ మానేపై ఆయన రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల విద్యన్ మానే మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఒక సినిమా ప్రాజెక్ట్ పేరుతో పలాష్ తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అంతేకాకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో జరగాల్సిన పెళ్లి క్యాన్సల్ కావడానికి పలాష్ ప్రవర్తనే కారణమని ఆరోపించాడు. పలాష్ మరో మహిళతో దొరికిపోయాడని, ఆ సమయంలో మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారని అందుకే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని అతడు ఆరోపించాడు.
అయితే ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ పూర్తిగా కొట్టిపారేస్తూ తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని పలాష్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజానికి పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ వివాదం నడుస్తుండగానే పలాష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి స్మృతి మంధానకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.