Palash Muchhal | ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల స్మృతి మంధానతో వ్యక్తిగత సంబంధాల కారణంగా వార్తల్లో నిలిచిన ఆయనపై ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన విజ్ఞాన్ ప్రకాష్ మానే అనే వ్యక్తి పలాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడైన పలాశ్ సినిమా నిర్మాణం పేరుతో రూ.25 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఆరు నెలల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇప్పటివరకు మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే సమయంలో, డబ్బుల విషయంలో ప్రశ్నించగా పలాశ్ తనను కులం పేరుతో దూషించాడని విజ్ఞాన్ మానే ఆరోపించారు. గత ఏడాది నవంబర్ 22న సాంగ్లీ-అష్టా రోడ్డులోని టోల్ ప్లాజా వద్ద ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాంగ్లీ పోలీసులు పలాశ్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)తో పాటు ఐపీసీ సెక్షన్లు 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పలాశ్ ముచ్చల్ వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన మరియు క్రికెటర్ స్మృతి మంధాన మధ్య నిశ్చితార్థం జరిగి, పెళ్లి కూడా ప్లాన్ అయినప్పటికీ అనూహ్యంగా అది రద్దయినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై అప్పట్లో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిపై స్పందించిన పలాశ్, ఆధారాలు లేని వార్తలను నమ్మవద్దని, తన వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొన్నారు. అయితే తాజాగా నమోదైన అట్రాసిటీ కేసుతో పలాశ్ ముచ్చల్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.