Pakeezah Vasuki | వాసుగి అలియాస్ పాకీజా గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు కాని 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదంటే అతిశయోక్తి. వెండితెరపై తిరుగులేని కమెడీయన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు పూట గడవడం కోసం భిక్షాటన చేసే దుస్థితిలో ఉంది. తమిళ ఇండస్ట్రీలో తనని ఎవరూ ఆదుకోకపోవడంతో.. ఇప్పుడు సాయం కోసం ఏపీకి వచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తుంది. “అసెంబ్లీ రౌడీ” చిత్రంలో ‘పాకీజా’ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న వాసుగి, ప్రస్తుతం అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుంది
పూట గడవని స్థితిలో,బిక్షం ఎత్తుకోవల్సిన పరిస్థితికి చేరానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకి సాయం చేస్తారని గుంటూరుకి వచ్చినట్టు తెలిపింది పాకీజా. ఇటీవల చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సమయంలో, గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె తన జీవితంలోని విషాదగాథని వివరించింది. తమిళనాడులో ఎన్ని వీడియోలు పంపినా ఒక్కరు స్పందించలేదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి గారు, నాగబాబు గారు, మోహన్ బాబు గారు అన్నీ ఇచ్చారు. వారు లేకపోతే నేను బతికుండే దానిని కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది.
వాసుగి స్వస్థలం కారైకుడి, తమిళనాడు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘పెదరాయుడు’, ‘అన్నమయ్య’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో జయలలిత ఆహ్వానం మేరకు అన్నాడీఎంకే పార్టీలో చేరారు. అక్కడి నుంచే నటనకు దూరమయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెను పట్టించుకునే వారే లేరు అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి మద్యం అడిక్షన్తో కుటుంబ ఆస్తులను దుర్వినియోగం చేశారు. అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొన్న వాసుగి, చివరకు భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఇల్లు కోల్పోయారు. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ఉన్న మొత్తాన్ని ఆమె వైద్యంలో ఖర్చు పెట్టారని చెప్పారు.నాకు కనీస జీవనాధారంగా ఒక చిన్న పింఛన్ ఇచ్చినా చాలు. బతికినంత కాలం చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు పేర్లు చెప్పుకుంటూ బ్రతుకుతాను. అవసరమైతే వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాను కూడా అని వాసుగి స్పష్టం చేశారు.