Pakeezah | 90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరించిన నటి పాకీజా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె అసలు పేరు వాసుకి . ఈ సీనియర్ నటి, ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని పాకీజా పాత్రతో విపరీతమైన గుర్తింపు సంపాదించుకుని అదే పేరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కమెడియన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె, నేడు దయనీయ పరిస్థితుల్లో వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాల్సిన స్థితికి చేరుకున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో వాసుకి ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. సినీ ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.
పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె దుర్భర జీవితం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ముందుకొచ్చి ఆమెకు ఆశ్రయం కల్పించారు. వాసుకి మాట్లాడుతూ.. తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తన పరిస్థితిని తెలుసుకున్న మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తన కళ్లకు శస్త్రచికిత్స చేయించారని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు కలిసి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా తనకు సహాయం చేశారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ సహాయం మరింత అవసరమని వాసుకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుకు వృద్ధాశ్రమ నిర్వాహకులు సహకరించారని, ప్రభుత్వం నుంచి పింఛను, బియ్యం కార్డు మంజూరైతే తన జీవితానికి పెద్ద ఆధారంగా ఉంటుందని కోరారు. ఆశ్రమంలో ఉన్న తోటి వృద్ధులకు తన వంతు సేవ చేస్తూ రోజులు గడుపుతున్నానని, ఇక్కడికి వచ్చినప్పుడు తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ, ఆప్యాయతలు ఎప్పటికీ మరువలేనివని ఆమె పేర్కొన్నారు.తమిళనాడుకు చెందిన వాసుకి 1991లో మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘మేజర్ చంద్రకాంత్’, ‘పెదరాయుడు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘బ్రహ్మ’, ‘పుణ్యభూమి నాదేశం’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన ఈ నటి ప్రస్తుత పరిస్థితి తెలుసుకుని సినీ అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు.