Dhurandhar | రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 1990ల కాలంలో పాకిస్థాన్‌లోని కరాచీ లయరీ ప్రాంతాన్ని వేదికగా చేసుకుని జరిగిన గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించడంతో సినిమాకు మరింత బలం చేకూరింది. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్ పాక్ గ్యాంగ్‌లను ఎలా మట్టుబెట్టాడన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే సుమారు రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, ‘ధురంధర్’ సాధిస్తున్న ఈ భారీ వసూళ్లపై ఇప్పుడు అనూహ్యమైన వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో తమ ప్రాంతాన్ని చూపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపిస్తూ, కరాచీలోని లయరీ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజలు వింత డిమాండ్ చేస్తున్నారు. సినిమా కలెక్షన్లలో తమకు 50 నుంచి 80 శాతం వరకు వాటా ఇవ్వాలని, లేదంటే కనీసం తమ ప్రాంతంలో ఒక ఆసుపత్రి అయినా నిర్మించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.మరోవైపు, ఈ సినిమాను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అక్కడి ప్రజలు పైరసీ మార్గాల ద్వారా ఈ సినిమాను పెద్ద ఎత్తున చూస్తున్నారని సమాచారం.
దాదాపు రెండు మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో ‘ధురంధర్’ పాక్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలకు అక్కడి యువత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఒకవైపు సినిమాపై నిషేధం కొనసాగుతుండగా, మరోవైపు తమ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగించారన్న కారణంతో వసూళ్లలో వాటా కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘ధురంధర్’ సినిమా కేవలం బాక్సాఫీస్ హిట్‌గా మాత్రమే కాకుండా, ఈ వింత డిమాండ్ కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది.