కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన నటీనటులను భారతీయ సినిమాల్లో తీసుకోవద్దని, వారు నటించే సినిమాలను బ్యాన్ చేయాలని సోషల్‌మీడియాలో నెటిజన్లు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు ఫవాద్‌ఖాన్, వాణీకపూర్ జంటగా నటించిన ‘అబీర్ గులాల్’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. మే 9న ఈ సినిమాను విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్తీ ఎస్ బగ్డీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నిర్మాణం నుంచే విమర్శలొస్తున్నాయి. ఓ పాకిస్థాన్ నటుడిని హీరోగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సోషల్‌మీడియా వేదికగా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూసీఈ) సైతం పాకిస్థాన్ నటులను అడ్డుకుంటామని, ‘అబిర్ గులాల్’ రిలీజ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ సైతం ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని గతంలోనే హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించే అవకాశాలున్నాయని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఉగ్రదాడి అనంతరం యూట్యూబ్ ఇండియాలో ఈ సినిమా పాటలను తొలగించారు.